Political parties:నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఓటర్లు

0
172

Political parties

-ప్రచార జోరు…నాయకుల హోరు
-ప్రజల నాడి దొరకపట్టని రాజకీయపార్టీలు
-పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన పార్లమెంటు ఎన్నికలు
-ఖర్చుకు వెనకాడకుండా విజయమే లక్ష్యంగా పావులు
-రంగంలోకి దిగిన ముఖ్య నాయకులు
-బంధువులు, కుల సంఘాల నేతలు, చోటా , మోటా నాయకులకు ఆఫర్లు
-అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారే అవకాశం


పదిరోజుల్లో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల నాడి పట్టలేక రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రజల విశ్వాసాన్ని చూరగొని విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు నాయకుల పాట్లు అంతా ఇంతా కావు. లోక్​ సభ ఎన్నికల చరిత్రలో ఏనాడు చూడని దృశ్యాలు ప్రస్తుత ఎన్నికలలో కనబడుతున్నాయి. ప్రచార జోరు మిన్నంటుతుంది. నాయకులు కూడా తమ పార్టీకే ఓటు వేయాలని గల్లీగల్లీ తిరుగుతున్నారు. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయిలో ప్రముఖులైన నాయకులు కూడా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నారు. మోడీ, అమిత్​ షా, నడ్డా, యోగీ ఆదిత్యనాథ్​, కాంగ్రెస్​ నుండి మల్లికార్జున ఖర్గే, రాహూల్​ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాష్ట్ర నాయకుల విషయానికి వస్తే రేవంత్​ రెడ్డి, కేసీఆర్​, కిషన్​ రెడ్డి , బండి సంజయ్​ , కేటీఆర్​, హరీశ్​ రావు వంటి నాయకులు రంగంలోకి దిగి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కష్టపడుతున్నారు. ఒకప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఇంత హడావుడిగా జరిగేవి కావు. ఏదో అభ్యర్థి నిలబడే వాడు..నిలబడ్డాడని ప్రకటనలు లేదా వార్తలు వచ్చేవి. సభలు , సమావేశాలు జరిగేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పార్లమెంటు ఎన్నికల అభ్యర్థి కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. కాలనీ కమిటీలతో మాట్లాడుతున్నారు. వార్డు మెంబర్ల నుండి ఎమ్మెల్యేల వరకు తన అనుచర గణాన్ని అందుబాటులో ఉంచుకుంటున్నారు. అవసరమైతే ఖర్చులకు ఎంపీగా నిల్చున్న అభ్యర్థులే డబ్బులు ఇస్తున్నారు. నమ్మకమైన వ్యక్తులను దగ్గర పెట్టుకుని ఎక్కడ ఏం జరుగుతున్నదో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

బంధువులు, స్నేహితులు కీలకం

బంధువులు, స్నేహితుల ద్వారా ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కులసంఘాల నేతలను వ్యక్తిగతంగా కలుస్తూ ఓట్లు తమకే వేసేలా చేయండని ప్రాధేయపడుతున్నారు. అవసరమైతే ఖర్చులకు డబ్బులు అందజేస్తున్నారు. సమాజంలో కొంత పరపతి ఉందని తెలిస్తే చాలు… అటువంటి వ్యక్తిని ఎగరేసుకు పోయేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇంత చేస్తున్నా ప్రజలు ఎవరి పక్షాన ఉంటున్నారో తెలియకపోతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. కార్నర్​ మీటింగ్​లు, బహిరంగ సభల్లో జనాలు ఎక్కువగా కనబడుతున్నప్పటికీ వీరందరూ తమకే ఓట్లు వేస్తారనే నమ్మకం అభ్యర్థుల్లో ఉండటం లేదు. ఉదయం, సాయంత్రం పూటల్లో వాతావరణం చల్లపడ్డ తర్వాత చోటా, మోటా నాయకులను ప్రసన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చోటా మోటా నాయకులు కూడా తమ డిమాండ్లను అభ్యర్థుల పార్టీల ముందుంచుతున్నారు. గెలిచన తర్వాత తమను పట్టించుకోరనే ఉద్దేశ్యంతో అందినకాడికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే


తెలంగాణలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలకు లోక్​ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ సీట్లు తక్కువ వస్తే సదరు పార్టీ భవిష్యత్తు తెలంగాణలో కష్టమేనని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి సర్వవిధాల ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం బీజేపీ.బీఆర్​ఎస్​ ల బలహీనతలను చేసిన తప్పిదాలను ప్రజల ముందుంచుతున్నది.బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి, బీఆర్​ఎస్​ రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణను నాశనం చేశారని విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా తక్కువేం కాదన్నట్లుగా ముందుకు సాగుతున్నది. బీఆర్​ఎస్​ పార్టీని, కాంగ్రెస్​ పార్టీని బదనాం చేసే పనిలో పడింది. బీఆర్​ ఎస్​ ప్రభుత్వ హయాంలో అవినీతి మయమైందని ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్​ పై ఒంటికాలిపై లేస్తూ ప్రధాని స్థాయి నాయకుడు మోడీ కూడా ట్రిపుల్​ఆర్ ట్యాక్స్​ అంటూ రేవంత్ రెడ్డి, రాహూల్​ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్​ పార్టీ ఇమేజ్​ ను డ్యామేజ్​ చేసే ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ కూడా ప్రచారాన్ని పెంచింది. కేటీఆర్​, హరీశ్​ రావు ప్రచారాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతుండగా కేసీఆర్​ బస్సు యాత్ర పేరిట ప్రతి జిల్లా తిరుగుతున్నారు. బీఆర్​ఎస్​ అధికారం కోల్పోవడం వల్ల జరిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. 100రోజుల్లో ఆరు గ్యారంటీల పథకాలు అమలు విఫలమైందని, రైతుబంధు, రుణమాపీ ఇవ్వడం లేదని ప్రజలను, రైతులను చైతన్య పరిచే ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మళ్లీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.ఇలా అన్ని పార్టీలు తమదైన శైలిలో అవతలిపార్టీలను అవినీతి పార్టీలుగా, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే పార్టీలుగా చిత్రీకరిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాగైనా మిగతా పార్టీకంటే పై చేయి సాధించాలనే పట్టుదలతో పార్టీలు ఉన్నాయి. అందుకోసం ఖర్చులకు కూడా వేనుకాడటం లేదు. దీంతో తెలంగాణ ఎన్నికల చరిత్రలో ఈ సారి జరిగే లోక్​ సభ ఎన్నికలు అత్యంత ఖరీదయ్యే ఎన్నికలుగా తయారయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here