Hero revanth reddy:అసలైన హీరో సీఎం రేవంత్ రెడ్డి

0
23

అల్లు అర్జున్ వ్యవహారంలో బాధిత కుటుంబం వైపు నిల్చున్న సీఎం

చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని ప్రకటన

సీనియర్ నటుడు మోహన్ బాబు విషయంలోనూ అదే పంథా

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలదోసి శభాష్ అనిపించుకున్న సీఎం

Hero revanth reddy:హీరో అంటే వీరుడని అర్థం. నిజంగా విజయం సాధించిన వారిని హీరో అనాల్సిందే. చలన చిత్ర ప్రదర్శన ప్రతినిధుల వల్ల ఇటీవల ఏర్పడిన వివాదాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎవరు నటులో, ఎవరు హీరోలో తేల్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.  ఇటీవల పుష్ప  సినిమా విడుదల సందర్భంగా  సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ  చనిపోవడం, అబ్బాయి తేజ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సీనియర్ నటుడు మోహన్ బాబు వ్యవహారం కూడా విమర్శలకు తావిచ్చింది. వార్తల కవరేజీకి వెళ్లిన చానల్ ప్రతినిధిని గాయపరిచిన సంఘటన పై దుమారం రేగింది. ఈ రెండు సంఘటనలు సినిమా పరిశ్రమ తీరును, ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రపంచానికి పరిచయం చేశాయి.

ఈ రెండు ఘటనల్లో బాధితులు సామాన్యులు కావడం..నిందితులు బడా పరిశ్రమకు చెందిన వారు కావడంతో ప్రజల ఆలోచన మొత్తం  ఈ రెండు సంఘటనల వైపే సాగింది. ఈ రెండింటిలో ముఖ్యంగా పుష్ప-2 సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ వ్యవహార తీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో సినిమా యూనిట్ తీరును ప్రజా సంఘాలు , రాజకీయపార్టీలు(ఒకటి రెండు మినహా) మిగతావి ఎండగట్టాయి. కనీసం చనిపోయిన రేవతి కుటుంబానికి సానుభూతి ప్రకటించలేదని, ప్రాణాపాయస్థితిలో ఉన్న తేజను పరామార్శించలేదని దుమ్మెత్తిపోశాయి. మీడియా కూడా అదే పంథాను అనుసరించక తప్పలేదు.

ఇదే క్రమంలో మోహన్ బాబు కుటుంబంలో జరిగిన వివాదాలు అందులో చానల్ ప్రతినిధి తల పగలడం. జర్నలిస్టు సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించడం వెంటవెంటనే జరిగాయి. ఐతే ఈ  రెండు వ్యవహారాల్లో ప్రభుత్వం నిస్పక్షపాతంగా వ్యవహరించడం ..తప్పు చేసిన వారు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఏ మాత్రం సంకోచించకుండా కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎక్కడా పక్షపాతం వహించలేదు. అంతేకాకుండా తప్పు చేస్తే ఎంతటి వాడైనా శిక్ష అనుభవించాల్సిందే అనే సంకేతాలను పంపించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించి ఆయన నైజాన్ని బహిర్గతపరిచారు. తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల వైపే నిలబడుతుందని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవ్వరూ అతీతులం కాదని కుండబద్దలు కొట్టారు.

అంతెందుకు మరో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున కు చెందిన కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేవేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఈ అక్రమ నిర్మాణం  ఎప్పటినుంచో ఉన్నప్పటికీ గతంలో ఎవరూ టచ్ చేయలేకపోయారు. నోటీసులు ఇచ్చి చేతులు నింపుకున్నారు. గత ప్రభుత్వాలు, పాలకులు సినిమా వారి తలబిరుసుకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు చెట్టాపట్టాలేసుకుని తిరుగడం, స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం వారితో స్నేహం చేయడం, వారు నిబంధనలు అతిక్రమిస్తున్న వదిలివేయడంతో తామేదో భువి నుంచి దివికి దిగివచ్చినట్లు ప్రత్యేకంగా ఫీలయ్యారు. తమను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఇష్టమొచ్చినట్లు పెట్రేగి పోయారు. అందుకు సవాలక్ష ఉదాహారణలున్నా ఇప్పుడు అవి అప్రస్తుతం. జరుగుతున్న సంఘటనలను పరిశీలించి నిజమైన హీరో  ఎవరన్నది ఇప్పుడు ప్రస్తుతం.

సినిమాల్లో కోట్ల డబ్బును రెమ్యునరేషన్ కింద తీసుకుని సమాజానికి తప్పుడు సందేశాలు పంపుతున్న కథానాయకులు హీరోలా?.. చట్టాన్ని అమలు చేస్తూ సమాజానికి నష్టం కలిగించే వారి పనిపట్టే వారు హీరోలా? అనే చర్చ జరుగుతున్నది.  జన బాహుళ్యం రేవంత్ రెడ్డిని హీరో అనక మానరు.  సినిమా వాళ్ల దుందుడుకు చర్యలకు ముకుతాడు వేసిన రేవంత్ నిజమైన హీరో అంటూ ప్రజలందరూ కీర్తిస్తున్నారు. అయినా డబ్బుకోసం నటించే నటులు సినిమాల్లో ఉంటారు. వారిని హీరోగా వర్ణించడం తప్పంటే తప్పు కేవలం నటులే. హీరో అంటే ప్రజల సంక్షేమం వైపు నిత్యం ఆలోచించే ప్రజా ప్రతినిధులు హీరోలు, సామాజిక కార్యకర్తలు హీరోలు, ప్రజల సమస్యలపై స్పందించే వారు హీరోలు, మన జవాన్ లు హీరోలు, మన కిసాన్ లు హీరోలు, ప్రాణాలు బ్రతికించే డాక్టర్లు హీరోలు, ఇలా చెప్పుకుంటూ పోతే సమాజ హితానికి  పనిచేసే ప్రతి ఒక్కడూ హీరో. హీరో అనే పదానికి గొప్ప అర్థముంది.

ప్రజా సమూహాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే మీడియాగా సినిమాకు పేరుంది. ఈ సినిమా సందేశాత్మకంగా ఉండాలి. చరిత్రను పరిచయం చేయాలి. కానీ దొంగతనాలు, దోపిడీలు, మాఫీయా కార్యకలాపాలను తెరకెక్కించడం ఏం సంస్క్రుతి. పోలీసులను లంచగొండులుగా, చేతకాని వాళ్లలా, ప్రజా ప్రతినిధులను అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ వ్యాపారం చేయడం ఎక్కడి విధానం. దీనివల్ల సమాజంలో అశాంతి రాజుకుంటే ఎవరు బాధ్యత వహించాలి. సినిమాలు చూసి యువత అసాంఘీక శక్తులుగా మారితే దీనికి సమాజం బలి అవదా?. శివ సినిమా వచ్చినప్పుడు సినిమా రంగంలో కొత్త ట్రెండ్ వచ్చిందని సంబుర పడ్డారు. కానీ అప్పుడు యువత మీద దాని ప్రభావం ఎంత చూపిందో గుర్తు తెచ్చుకుంటే ఒల్లు గగుర్పొడుస్తుంది. అప్పట్లో చాలా కాలేజీల్లో చైన్ బ్యాచ్ లు ఏ ర్పడ్డాయి. గ్రూపులుగా  ఏర్పడి కొట్టుకున్న బ్యాచ్ లు పెరిగాయి. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు డ్రగ్స్ మాఫియా లేదా ఆయుధ వ్యాపారం, దొంగతనాలు చేయడం వంటి కథలతో వస్తున్నాయి. ఇటువంటి సినిమాలు చూస్తున్న నూనుగు మీసాల యువత ఏం నేర్చుకోవాలి.

ఇప్పుడు హీరో రేవంత్ రెడ్డి

ఇప్పుడు ప్రస్తుత హీరో రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. అధికారంలోకి రాగానే మాదక ద్రవ్యాలపై ఫోకస్ పెంచారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపారు. విద్య సంస్థల వద్ద ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నియంత్రించారు. వీటన్నింటిని ప్రజలందరూ ముక్తకంఠంతో హర్షించారు. అనేక మంది తల్లితండ్రులు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. తమ పిల్లలు వీటి బారిన పడకుండా చూసిన వ్యక్తిగా ప్రజలు మనసులోనే నమస్కరించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రాను ఏర్పాటు చేసి కూల్చినప్పుడు నిజమైన హీరో రెవంత్ రెడ్డి అని కొనియాడారు. అల్లు అర్జున్  అరెస్టయినప్పుడు, అసెంబ్లీలో రేవతి కుటుంబం వైపు మాట్లాడినప్పుడు చప్పట్లు చరిచారు. సినిమావాళ్లు మరిచిపోయిన మానవత్వాన్ని గుర్తు చేసినప్పుడు మహానుభావుడు అనుకున్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులు, సినిమా సీనియర్ నటులు తప్పయింది ప్రభో నువ్వే దిక్కని సీఎం కోసం వచ్చినప్పుడు హీరోగా ప్రజలకు కనబడింది రేవంత్ రెడ్డినే. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు సినిమా నటుల అడుగులకు మడుగులొత్తితే..ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి భిన్నంగా వ్యవహరించడంతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. సినిమావాళ్లతో జరిగిన సమావేశంలో కూడా రాష్ట్ర అభివ్రుద్ది ప్రజల సంక్షేమం మీద మాట్లాడటం..దానికి సినీ పరిశ్రమ కట్టుబడి ఉండాలని సూచించడం ఆయనలో ఉన్న హీరోయిజానికి మచ్చుతునక మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here