స్వేచ్ఛ నిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్
ఎనిమిది నెలల్లో 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్
సగటున నెలకు 20 మంది అరెస్ట్
ACB:
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా ముందుకెళుతోంది. గడచిన 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి స్వేచ్ఛ ఇవ్వడంతో అవినీతి పరుల భరతం పడుతున్నది. ప్రతీరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఒక్కోరోజు రెండు మూడు ప్రాంతాల్లో సోదాలు చేసి వేర్వేరు డిపార్టుమెంటులో పనిచేస్తున్న లంచవతారులను పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏసీబీ భయం లేకుండా ఉండేది. కానీ ప్రస్తుతం తాము ఆడిందే ఆట అన్నట్లు సాగిన అధికారుల పరిస్థితి ఇప్పుడు ఏసీబీ భయంతో జంకుతున్నారు. ఇప్పటి వరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మొత్తం రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది. గత నెల ఆగస్ట్‌లో ఏసీబీ 31 కేసులు నమోదు చేసింది. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులను అరెస్ట్ చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్‌ఫ్రీ నంబర్(1064)ను, వాట్సాప్‌నంబర్(9440446106)ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు.బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి.. లంచగొండులకు చెక్పెడ్తున్నారు. అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లనూ గుర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇండ్లలో ఇటీవల తనిఖీలు చేసి.. వందల కోట్లు విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. సగటున నెలకు 20 కేసులు రికార్డవుతుండగా.. 20 మంది అరెస్టవుతున్నారు. ఈ ఎనిమిది నెలల్లో పట్టుబడ్డవాళ్లలో 20 మందికి పైగా మహిళా అధికారులతో పాటు పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే.. అవినీతిలో ఫస్ట్ ప్లేస్‌లో రెవెన్యూ శాఖ, రెండో ప్లేస్‌లో పోలీస్ శాఖ, మూడో ప్లేస్‌లో మున్సిపల్ శాఖ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక లంచావతారుల పని పట్టే పనికి శ్రీకారం చుట్టి ఏసీబీకి జవసత్వాలు నింపి అవినీతి పరులకు ఏసీబీ అంటే హడల్ అనిపించగా , విజయ్ కుమార్ ఏసీబీ చీఫ్ బాధ్యతలు స్వీకరించాక అవినీతి పరులకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నారు.