collectors conference:పేదల సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లు: సీఎం రేవంత్ రెడ్డి

0
21

కలెక్టర్లు కార్యాలయాలకే పరమితం కావద్దు

మహిళా ఐఏఎస్.ఐపీఎస్ లు హాస్టళ్లలో బస చేయాలి

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి

collectors conference:పేదల సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం… విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులని.. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా.. గొప్ప పేరు రావాలన్నా కలెక్టర్లే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు అన్ని జిల్లాల కలెక్టర్లను అభినందించారు.ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లేనని.. వాని పనితీరే ప్రభుత్వ పని తీరుకు కొలమానమవుతుందని అన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు.  కొంతమంది కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారని, క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అప్రమత్తం చేశారు.

జనవరి 26 తర్వాత జిల్లాల్లో సీఎం పర్యటన..

జనవరి 26 తరువాత జిల్లాలో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టల్స్ విజిట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడే రాత్రి బస చేయాలని చెప్పారు.  విద్యార్థుల అవసరాలను, ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం అందించేసంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచటంతో పాటు, భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలకు రూ.12 వేల నగదు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. ఏళ్లకేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులతో పాటు గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.

వ్యవసాయయోగ్యమైన భూములకే రైతుభరోసా

గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిందని, గత ప్రభుత్వం  వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  అర్హులైన రైతులందరికీ రైతు భరోసా చెల్లించాలని, అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి  పొందకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు. ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికో నోడల్ ఆఫీసర్లను నియమించాలన్నారు. అధికారుల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి అనర్హులను గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లు లేవనెత్తిన సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు.వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  వ్యవసాయానికి అక్కరకు రాని భూములను గుర్తించి, వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలన్నారు. రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు,  మైనింగ్ భూములు, గోదాములు ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టుల కు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు ఈ అనర్హత జాబితాలోకి వస్తాయని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here