curruption:రాబడి శాఖల్లో అడ్డగోలు అవినీతి

0
34

curruption:

బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలు

విమర్శలు వచ్చినా మారని తీరు

స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణాశాఖ

ఫోకల్ పోస్టింగులకు పదోన్నతులకు కోట్లలో బేరం

(రాందేని చంద్రమౌళి సీనియర్ జర్నలిస్టు 7799563979)

ప్రభుత్వ ఖజానాకు రాబడి తెచ్చే శాఖల్లో అవినీతి రాజ్యమేలుతుంది. అనేక ఆరోపణలు వస్తున్నా వీటి తీరు మారడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నేషదం ఎత్తివేయడంతో పోస్టింగుల్లో జరిగిన పరిణామాలు ప్రతీశాఖకు మచ్చ తేవడంతోపాటు ప్రభుత్వ పెద్దలకు కూడా చెడ్డ పేరు తెచ్చింది. అత్యధిక ఆదాయం తెచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తోపాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రవాణాశాఖ కు చెందిన ఉద్యోగుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ బదిలీల్లో మంత్రులు, మంత్రుల పేషీల్లో అధికారులు, సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేసి తమకు అనుకూలమైన వారికి ఫోకల్ పోస్టులు ఇప్పించుకున్నట్లు తెలిసింది.ఆదాయం ఎక్కువగా వచ్చే పోస్టింగులకు ఒక్కో పోస్టుకు రూ.40 లక్షల నుంచి కోటి వరకు పలికిందని సంబంధిత శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. అనేకశాఖల్లో పోస్టింగులపై బదిలీల సమయంలో భారీగా ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రధానమైన నాలుగు శాఖల్లో మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ప్రచారం జరుగుతున్నది. నిషేదం సడలించి మళ్లీ నిషేదం విధించినా ప్రతి శాఖలో ఇదే చర్చ జరుగుతున్నది. తమకు అనుకూలంగా లేరనో..లేదా అడిగినంత ఇవ్వలేదనే కారణంతో చాలా మంది అర్హులైన అధికారులను వివిధ కారణాలు చూపెట్టి అన్యాయం చేశారనే ప్రచారం జరుగుతున్నది.

ఎక్సైజ్ శాఖ విషయానికి వస్తే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్, ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ , డిప్యూటీ కమిషనర్ తదితర బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయని కోట్ల రూపాయలు చేతులు మారాయని చర్చ జరుగుతున్నది. ఇక రవాణాశాఖ లో యూనిఫాం డిపార్ట్ మెంటు తోపాటు మినిస్ట్రీయల్ స్టాఫ్ పోస్టింగుల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయని తెలుస్తున్నది. ఎందుకంటే ముందుగానే తమకు ఎక్క డ పోస్టింగ్ వస్తుందో రవాణాశాఖ ఉద్యోగులు ముందుగానే ప్రకటించుకున్నారు. పదోన్నతుల విషయంలో సీఎం పేషీ, రవాణాశాఖ మంత్రి పేషీపై అనేక ఆరోపణలు వచ్చాయి. చివరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్ పై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ ఎక్కువ చెక్ పోస్టు పోస్టింగుల విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చర్చ జరుగుతున్నది.అదేవిధంగా త్వరలో జరుగబోయే ఆర్ టీవో , డీటీవో వంటి పదోన్నతుల్లో కూడా ఇప్పటి నుంచే పైరవీలు మొదలయ్యాయని తెలిసింది. దీనికోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా కొంతమంది పైరవీలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతున్నది.

ఇక అత్యధిక ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బదిలీల్లో వచ్చిన ఆరోపణలు మరే శాఖలో రాలేదనే చెప్పాలి. సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. వీరి అవినీతి వ్యవహారాలు నిత్యం చూస్తున్నప్పటికీ ఇటీవల జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫోకల్ పోస్టింగుల కోసం కొందరైతే కోటిన్నర వరకు సమర్పించుకున్నట్లు తెలిసింది. వీరికి పోస్టింగులు ఇప్పించడంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయలు, వారి బంధువులు జోక్యం చేసుకున్నట్లు సమాచారం ఉంది.సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు సబ్ రిజిస్ట్రార్ 1, సబ్ రిజిస్ట్రార్ క్యాడర్ 2, డిస్ట్రిక్స్ రిజిస్ట్రార్ వంటి బదిలీలు. పదోన్నతుల్లో కూడా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పెద్ద ఎత్తున స్వంత శాఖలో చర్చ జరుగుతున్నది. ఇక వాణిజ్య పన్నుల శాఖలో కూడా సీనియర్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నుంచి మొదలు కుని అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సూపరిండెంట్ , స్పెషల్ గ్రేడ్ సూపరిండెంట్, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పోస్టుల వరకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. బదిలీల వ్యవహారం మొతం చాలా డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులకు, పేషీలకు కాసులు కురిపించిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇక వైద్యారోగ్యశాఖ బదిలీల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. వ్యవసాయశాఖ తదితర ముఖ్యమైన శాఖల్లో కూడా ఇదే తీరు లో సాగింది. అనారోగ్య సమస్యలున్న వారి దరఖాస్తులను పక్కకు పెట్టేశారు. పైరవీ చేయడం చేతకాని వారికి అన్యాయం చేసిందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here