Ghmc mayor:: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.క్షేత్ర పరిధి సందర్శనలో భాగంగా బుధవారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూకట్పల్లి జోన్లోని బాలానగర్, అల్లాపూర్ వార్డులలో పలు ప్రాంతాలను సందర్శించి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి, సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటూ, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేయర్ తెలిపారు. బాలానగర్ డివిజన్లోని వినాయక నగర్, రాజీవ్ గాంధీ నగర్ లలో పర్యటించి నాలాలు, జిహెచ్ఎంసి పార్కును సందర్శించారు. వినాయక నగర్ నాలాలో డి-సిల్టింగ్ క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పార్కులు, చెరువులు తదితర ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని, ఇంటింటికి వెళ్లి యాంటీ లార్వా ఆపరేషన్లు చేయాలని ఎంటమాలజీ అధికారులకు ఆదేశించారు. జిహెచ్ఎంసి పార్క్ ఓపెన్ గ్రౌండ్ లో మొక్కలు నాటడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాజీవ్ గాంధీ నగర్ లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, పాత బ్రిడ్జి ని వైయిండనింగ్ చేయాలని, కొన్ని చోట్ల వీధి లైట్లు వెలగడం లేదని కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మేయర్ దృష్టికి తిసుకురాగా, వైయిండనింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అల్లాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సప్దాదార్ నగర్ ఇ-బ్లాక్ సీవరేజ్ లైన్, రోడ్డు పనులు, రాజీవ్ గాంధీ నగర్ సి-బ్లాక్లో సీవరేజ్ పనులు, రోడ్డు మరమ్మత్తులు, ప్రహరీ గోడ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. కూబా మజీద్ వద్ద స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మించాలని కార్పొరేటర్ సబియా బేగం మేయర్ ను కోరగా, స్ట్రామ్ వాటర్ కాలువ నిర్మాణ పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు మేయర్ సూచించారు. స్ట్రీట్ లైట్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు సూచించారు. ఆయా డివిజన్ లలో అవసరమైన చిన్న చిన్న పనులను వెంటనే చేయాలని మేయర్ అధికారులకు ఆదేశించారు.