PM MODI:
*దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ట్యాక్స్ పై చర్చ
-బీఆర్ఎస్ ప్రభావం కనబడటం లేదు
–అవినీతిలో కాంగ్రెస్, బీఆార్ఎస్ ది ఫెవికాల్ బంధం
-పీవీని కాంగ్రెస్ అవమానిస్గే బీజేపీ గౌరవించింది
-శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
-ప్రధానమంత్రి నరేంద్రమోదీ
మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేముల వాడతోపాటు వరంగల్‌లో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ భాజపా, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందని వ్యాఖ్యానించారు. సభ ప్రారంభానికి ముందు శ్రీరాజరాజేశ్వరస్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోదీ మాట్లాడతూ దక్షిణ కాశీ భగవానుడు శ్రీరాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాటల్లోనే ‘‘తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. మీ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. వ్యవసాయాన్ని ఆధునికీకరించి లాభసాటిగా మార్చాం. ఆ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం.
భారాస ప్రభావం మచ్చుకైనా కనిపించట్లేదు
కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇక్కడ భారాస ప్రభావం మచ్చుకైనా కనిపించట్లేదు. కాంగ్రెస్, భారాసలకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. భాజపా మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ‘కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..’ ఈ నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. భారాస, కాంగ్రెస్ రెండూ ఒకటే.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివి. అవి అవినీతి పార్టీలు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కాలరాశాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే భారాస పనిచేసింది. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ కూడా కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసింది. వంశపారంపర్య రాజకీయాలతో దోపిడీ చేసింది. మాజీ ప్రధాని పీవీని కూడా ఆ పార్టీ అవమానించింది. ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోకి అనుమతించలేదు. పీవీకి భారతరత్న ప్రకటించి భాజపా గౌరవించింది. దేశానికి ఆయన చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. పీవీ కుటుంబంలోని మూడు తరాల సభ్యులను కలిశాను. వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నా.అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ ది ఫెవికాల్ బంధం. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం అవినీతి సిండికేట్‌గా మారుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.. అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయట్లేదు. తెలంగాణ నుంచి దిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్ ట్యాక్సుపైనే చర్చ జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కంటే ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయి. తెలంగాణలోని ఆర్ లూటీ చేసి.. దిల్లీలోని ఆర్‌కు ఇస్తున్నారు. వారి ఆటను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు’’ అని మోదీ అన్నారు.ఎన్నికల ప్రచారం, పోలింగ్‌కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేఈ సందర్భంగా కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన ‘జాతి వివక్ష’ వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు.
‘‘కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉన్నా కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారు. ఎస్సీల విషయంలో ఆ పార్టీ వెనకడుగు వేసింది. దీనిపై నేనిచ్చిన వాగ్దానం నెరవేరుస్తా. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశాం. రెండోసారి వచ్చాక ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఆ ఆదివాసీ బిడ్డను హస్తం పార్టీ వ్యతిరేకించింది. ఆమెను ఓడించాలని యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని ఆ పార్టీ చూస్తోంది? చాలా మంది ప్రజల శరీరరంగు నలుపు ఉంటుంది. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు.దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన వేళ ప్రధాని ఈ విధంగా స్పందించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు.
‘‘కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి. ఆ పార్టీ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసగించింది. రాష్ట్రంలో అ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోంది. అందులో ఒక భాగం హైదరాబాద్.. మరో భాగం దిల్లీకి వెళ్తోంది. భారాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణానికి పాల్పడింది. ఆ పార్టీని రక్షించే పనిలో కాంగ్రెస్ ఉంది. కాళేశ్వరం పేరిట జరిగిన నష్టాన్ని ఇప్పుడు రైతులు భరించాల్సిన పరిస్థితి. అన్నదాతకు భాజపా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. రికార్డు స్థాయిలో వరి, పత్తి కొనుగోళ్లు చేశాం. అన్నదాతలకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నాం. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాం. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసినా సరిగా నిర్వహించట్లేదు’’ అని మోదీ అన్నారు.