TET RESULTS:
తెలంగాణ టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. పేపర్-1లో 67.13 శాతం మంది, పేపర్-2 లో 34.18 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-1లో మొత్తం 85,996 మంది పరీక్ష రాయగా 57,725 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్-2కు మొత్తం 1,50,491 మంది పరీక్ష రాయగా.. కేవలం 51,443 మంది మాత్రమే అర్హత సాధించారు.
అభ్యర్థలు ఫలితాల కోసం schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. గత ఏడాది జరిగిన టెట్ పరీక్షలతో పోలిస్తే ఈ ఏడాది పేపర్-1లో ఉత్తీర్ణత శాతం 30.24 శాతం, పేపర్-2లో ఉత్తీర్ణత శాతం 18.88 శాతం పెరిగిందని వెల్లడించారు. అయితే టెట్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది.
ఈసారి టెట్ అర్హత సాధించనివారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా టెట్‌లో అర్హత సాధించిన వాళ్లు డీఎస్సీకి ఎలాంటి ఫీజులేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా టెట్-2024 ఫీజును తగ్గించలేకపోయామని ప్రభుత్వం తెలిపింది. అందుకే తదుపరి టెట్, డీఎస్సీ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.