న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల చేతుల మీదుగా ప్రవేశపెట్టనున్న బిల్లు
ఇప్పటికే 32 పార్టీల మద్ధతు, 15 పార్టీలు వ్యతిరేకత
One election bill;జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మేఘ్వాల్ కోరనున్నారు. ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. ఏ పార్టీ తరఫున ఎంతమంది సభ్యులు ఉంటారో స్పీకర్ సాయంత్రానికి ప్రకటించనున్నారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి కమిటీ చైర్మన్ ఉండనున్నారు. కమిటీలో ఉండేందుకు ఎంపీల పేర్లను ఇవాళే ప్రతిపాదించాలని రాజకీయ పార్టీలను స్పీకర్ కోరనున్నారు. ప్రాథమికంగా ఈ కమిటీ కాలపరిమితి 90 రోజులు విధించనున్నారు. తర్వాత ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది. కాగా, జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించినట్టు ఇప్పటికే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏదైనా అసెంబ్లీకి ఎన్నిక నిర్వహించలేని పరిస్థితుల్లో తర్వాత నిర్వహించే అవకాశం ఉండనుంది. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టనున్న జమిలి ఎన్నికల బిల్లులో కీలక ప్రొవిజన్ ఉంది. ‘లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏదైనా అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం భావించినప్పుడు, ఆ అసెంబ్లీకి తర్వాత ఎన్నికలు జరిపేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు’ అని రాజ్యాంగ(129వ) సవరణ బిల్లులోని సెక్షన్ 2లోని సబ్ క్లాజ్ 5లో పొందుపరిచారు. కాగా, లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్ర మంత్రివర్గం రెండు బిల్లులను తాజాగా ఆమోదించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశాన్ని కేంద్రం తాత్కాలికంగా పక్కన పెట్టింది. మంగళవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ క్రమంలో అసలు జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్‌సభ తొలిసారి సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఈ లెక్కన ఈ లోక్‌సభ తొలి సమావేశం గత జూన్ 24న జరిగింది. అంటే లోక్‌సభ కాలపరిమితి తీరిపోయే నాటికి అంటే జూన్ 24, 2029లోపు జమిలి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని విశ్లేషిస్తే, 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు 2029లోనే అంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అలాగే, తన పూర్తి పదవీకాలాన్ని వదులుకోవడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని, ఈ క్రమంలో 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 2027లో, 2028లో కూడా జమిలి ఎన్నికల నిర్వహణను కొట్టిపారేయలేమని, బిల్లు చట్టంగా మారాక, ఇది అంత కష్టతరమైన పనేమీకాదని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలాఉండగా.. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సమావేశమయ్యే తొలి లోక్‌సభ సమావేశంలో జమిలి బిల్లును రాష్ట్రపతి నోటిఫై చేయాలని, ఆ రోజును అపాయింటెడ్ డేగా తీసుకొంటే.. ఆ తర్వాత ఐదేండ్లకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తారన్న వాదనను కూడా కొందరు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇదేజరిగితే, జమిలి ఎన్నికలు 2034లోనే జరుగొచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.