- ఏసీబీ సోదాలతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు
- ఏజంట్లు, అసిస్టెంట్ల వైఖరితో ఫిర్యాదుల వెల్లువ
- ప్రోత్సహిస్తున్న అధికారులు
రవాణాశాఖ పరేషాన్ అవుతున్నది. ఏసీబీ సోదాలతో అధికారులు, సిబ్బంది నిద్రలేని రాత్రులు గడుపాల్సి వస్తుంది. అవినీతి అధికారులు, సిబ్బంది వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అవినీతిని నియంత్రించడానికి ప్రభుత్వం ఏసీబీకీ పూర్తి స్వేఛ్చ ఇవ్వడంతో అవినీతి పరుల భరతం పట్టేందుకు ప్రతిరోజు ఏదో ఒక చోట సోదాలు చేస్తూ అవినీతి పరులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటుంది. శాఖ ఏదైనా అవినీతిపై ఫిర్యాదు వస్తే చాలు రంగంలోకి దిగి భరతం పడుతోంది. ఇక రవాణాశాఖ విషయానికి వస్తే అవినీతి బహిరంగంగా జరిగినా చర్యలు తీసుకోకపోవడంతో కార్యాలయాల్లో తమకేమీకాదులే అంటూ రెచ్చిపోతున్నారు. కట్టడి చేయాల్సిన ఉన్నతాధికారులు అవినీతి అధికారులకు అండగా ఉండటంతో తాము ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఉదాహారణే పెద్దపల్లి ఆర్ టీ వో కార్యాలయం. ఒక లారీ ఓనర్ తాను లంచం ఇవ్వనందుకే అధికారులు తనపై కక్ష్య కట్టి అనేక సార్లు ఫైన్ వేశారని ఆరోపిస్తూ కార్యాలయం ఆవరణలోనే ఆత్మహత్య ప్రయత్నం చేశారు. డబ్బులు కావాలంటే తీసుకోండని డబ్బులు విసిరి వేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం లేపినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. అక్కడ నుంచి అధికారిని మార్చలేదు. అంతెందుకు సికింద్రాబాద్ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు,ఫిర్యాదులు వచ్చాయి. ఐతే అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డ అధికారులు, సిబ్బందిపై చర్యలు శూన్యం. కేవలం అక్కడ డీటీసీ అధికారి స్థాయిని ఇంచార్జి గా వేసి చేతులు దులుపుకున్నారు. ఇక ఉప్పల్ వంటి పెద్ద కార్యాలయంలో ఆర్ టీ వో ను నియమించలేదు. మేడ్చల్ డీటీవోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్, ఉప్పల్ తో పాటు, మరో రెండు బాధ్యతలు ఆయనకు అప్పగించడంతో సమయం కేటాయించక కంట్రోల్ తప్పింది. ఇక కామారెడ్డి లోని సాలాబాత్ పూర్ చెక్ పోస్టు పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నా కమిషనర్ కార్యాలయం నుండి ఎటువంటి చర్యలు లేవు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో సోదాలు జరిగాయి.

చెక్ పోస్టుల్లో అసిస్టెంట్లు… కార్యాలయాల్లో ఏజంట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల్లో అసిస్టెంట్లు, కార్యాలయాల్లో ఏజంట్ల హవా కొనసాగుతున్నది. ఒక్కో చెక్ పోస్టుల్లో 8 నుండి 10 మంది ఎంవీఐలు ఉన్నప్పటీకీ ప్రతిరోజు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే డ్యూటీలు ఉంటారు. మిగతా వారు మేనేజ్ చేసుకుంటూ డ్యూటీలకు ఎగనామం పెడుతారు. దీనివల్ల హోంగార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు పనిచేస్తుంటారు. ఎక్కడ చెక్ పోస్టు చూసినా అసిస్టెంట్ల విచ్చలవిడితనం కనబడుతుంది. అసిస్టెంట్లందరూ ఏదో ఒక ఎంవీఐకి లేదా ఏఎంవీఐకి పనిచేస్తుంటారు. ఇక ప్రతి ఆర్ టీవో కార్యాలయంలో 50 నుంచి వంద మందికి పైగా ఏజంట్లు ఉన్నారు. ఏజెంట్ల కనుసన్నలలో అన్ని కార్యాలయాలు పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వీరు ఆర్డర్ వేస్తేనే ఆర్ టీ వో కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. అంతెందుకు ఖైరతబాద్ లోని కమిషనర్ కార్యాలయం ఆవరణలోనే నిత్యం వందలాది మంది ఏజెంట్లు ఆర్ టీ వో కార్యాలయానికి వచ్చి పోయే వారి వెంటపడి వేధిస్తుంటారు. డైరెక్టుగా పని కాదని బహరంగంగానే చెబుతుంటారు. కమిషనర్ తోపాటు ముగ్గురు జేటీసీలు ఉన్న ప్రాంతంలోని ఆర్ టీ వో కార్యాలయాల్లో అధికారులను, సిబ్బందిని ఏజెంట్లు శాసిస్తుంటారు. కెమెరాలు బిగించినా ఫలితం లేకుండా పోయింది. ఖైరతాబాద్ ఆర్ టీ వో కార్యాలయం లో ఒక్కో ఫైలుకు ఏజెంట్లు, అధికారుల అసిస్టెంట్లు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వసూలు చేస్తున్నా నియంత్రణ చర్యలు శూన్యం. ఇక గ్రేటర్ పరిధిలోని శివారు ప్రాంత కార్యాలయాలైన ఇబ్రహీంపట్నం , మేడ్చల్, కూకట్ పల్లి యునిట్ ఆఫీస్ లో ఏజంట్లు విచ్చలవిడి దందాలకు పాల్పడుతున్నారని కార్యాలయానికి వచ్చే వారు అభిప్రాయపడుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజంట్లను అధికారులే ప్రొత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది అధికారులు ప్రైవేటు అసిస్టెంట్లను పెట్టుకుని ఏజంట్లతో సమన్వయం చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఈ ఏజంట్ల వ్యవస్థ వల్ల తమకు మచ్చ ఏర్పడుతుందని కొంతమంది అధికారులు అభిప్రాయపడుతూ నిరాకరిస్తున్నా మిగతా సిబ్బంది, అధికారులు సహకరించడం లేదు. ఒత్తిడి పెరుగుతుండటంతో అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి.
వణికిస్తున్న ఏసీబీ
అన్ని శాఖలతో పాటు రవాణాశాఖ ను ఏసీబీ వణికిస్తున్నది. సరిగ్గా సంవత్సరం క్రితం మే 28,2024న ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాలు, చెక్ పోస్టుల్లో సోదాలు నిర్వహించింది. ఒకే సారి 12 ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలు జరిపి ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో హైదరాబాద్ జేటీసీ పరిధిలోని మలక్ పేట, బండ్లగూడ, టోలీచౌకీ ఆర్ టీ వో కార్యాలయాలుండగా, వీటితోపాటు రంగారెడ్డి ఆర్ టీఏ, కరీంగనగర్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఆర్ టీ ఏ కార్యాలయాలున్నాయి. చెక్ పోస్టుల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలోని సాలూర్ చెక్ పోస్టు, ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట చెక్ పోస్టులు న్నాయి. 15 ఏసీబీ టీంలు పాల్గొని అనధికార మొత్తాన్ని గుర్తించాయి. డిసెంబర్ 4, 2024న గద్వాలలోని అలంపూర్ చెక్ పోస్టు, నల్గొండ లోని విష్ణుపురం, ఆదిలాబాద్ లోని భోరజ్ చెక్ పోస్టుల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అదేవిధంగా మార్చి 12 ,2025న నిజమాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంో ఏసీబీ సోదాలు చేసింది. సోదాల్లో 14 ఆర్ సీలు రూ.27 వేల నగదు ఖలీల్ అనే ఏజంటు వద్ద ఏసీబీకి దొరికాయి. ఇదే నిజామాబాద్ జిల్లా లోని సాలాబాత్పూర్ చెక్ పోస్టులో రెండు రోజుల క్రితం మళ్లీ సోదాలు జరిగాయి. ఇదే చెక్ పోస్టులో అనేకసార్లు ఏసీబీ సోదాలు నిర్వహించి అవినీతిపై కొరడా ఝలపించింది.అయినా ఈ చెక్ పోస్టులో అవినీతి ఆగడం లేదు. రెండు రోజుల క్రితం జరిపిన సోదాల్లో గ్రేటర్ పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, పెద్దపల్లి ఆర్ టీ వో కార్యాలయాలు ఉన్నాయి.