ACB:ఏసీబీ వలలో జాయింట్ కలెక్టర్

0
69

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి అదనపు కలెక్టర్

అవినీతి అధికారులు తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ సీవీ ఆనంద్

(రాందేని చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు 7799563979)

ACB:

అవినీతి నిరోధక శాఖ వలలో భారీ తిమింగిలం చిక్కింది. లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆయనతోపాటు కలెక్టరేట్‌ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యంరెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డిని కోరారు. అయితే ఈ పనిచేసేందుకు ఆయన రూ.8 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. ఆ మొత్తాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నారు.

అధికారులతో పట్టుబడ్డ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ జేసీ భూపాల్‌రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పారు. వెంటనే జేసీ భూపాల్ రెడ్డి కి అతనితో ఫోన్‌ చేయించారు. పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్దకు ఆ డబ్బును తీసుకురావాలని చెప్పాడు. దీంతో మదన్‌మోహన్‌తోపాటు అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. అతని నుంచి డబ్బులు తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా జేసీ భూపాల్‌ రెడ్డిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన అనంతరం.. ఇరువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నాగోల్‌లోని భూపాల్‌ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.

అవినీతికి పాల్పడితే తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ట్వీట్

అవినీతికి పాల్పడే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నుంచి తప్పించుకోలేరని తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చెందిన జాయింట్ కలెక్టర్ ఎంవీ. భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అ.ని.శా అధికారులకు చిక్కిన విషయాన్ని షేర్ చేస్తూ ఎక్స్‌ ఖాతాలో సీవీ ఆనంద్‌ ట్వీట్ చేశారు.14 గుంటల భూమిని ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకుగాను సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తదుపరి ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందచేశారు. ఫిర్యాదుదారుని నుండి నగర శివార్లలో డబ్బు తీసుకోవటం.. ఆపై ORR దగ్గర జాయింట్ కలెక్టర్‌కు అందేలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఏసీబీ టీమ్ రాత్రంతా ఎంతో చాకచక్యంగా అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేశారని సీవీ ఆనంద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ మేరకు పట్టుబడ్డ నిందితుల ఫోటోలను కూడా ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here