DY CM:ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభత్వానికి డోకా లేదు : తెలంగాణ డీప్యూటీ సీఎం విక్రమార్క

0
45

Dy CM:

ఎవ‌రెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఐదేండ్లు డోకా లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కోరి కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ప్రజా పాలన అందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలపై ప‌న్నుల భారం మోప‌కుండ రాష్ట్ర ఆదాయం పెంచుతామ‌న్నారు. బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​ లో ఏర్పాటు చేసిన మీట్​ ది ప్రెస్​ లో పాల్గొని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 10 ఏండ్లలో వ‌చ్చింది రూ. 3.70లక్షల కోట్లు మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు ఇచ్చామన్నది పచ్చి అబద్ధమని అన్నారు. వచ్చిన మొత్తం కూడా రాష్ట్రానికి న్యాయంగా రావల్సినవేనని అన్నారు. 2023 డిసెంబ‌ర్ 7న అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ‌త ప్రభుత్వం రూ.3690 కోట్ల లోటు బ‌డ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్పిందన్నారు. కానీ ఎన్నిక‌ల ముందు బీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతు బంధుకు రూ.7వేల కోట్లు కేటాయించామ‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమ‌తి ఇస్తే రైతుల ఖాతాల్లో వేస్తామ‌ని చెప్పాదని గుర్తు చేశారు. గ‌త ప్రభుత్వం మాకు మైనస్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పింది. ఈ లెక్కన మీరు చెబుతున్న రూ. 7వేల‌ కోట్లు ఏమైనాయ్‌? మీరే తిన్నారా? లేక ఆ డబ్బులు ఎక్కడకు పోయినట్లు? ఎవరి అకౌంట్లోకి పోయినట్లు? ఎవరి దగ్గర ఉన్నయో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు స‌మాధానం చెప్పాల‌న్నారు. గ‌త ప్రభుత్వం చేసిన అప్పుల‌కు ఈ నాలుగు నెల‌ల్లో వ‌డ్డీలు మ‌రియు అప్పులు క‌లిపి మొత్తం 26,374 కోట్లు చెల్లించామ‌న్నారు.

గ‌త ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయ‌గా రూపాయి రూపాయి పోగేసి గాడిలో పెట్టి ఓక‌టో తారీఖున ఉద్యోగులకు, పెన్షన్​ దారుల‌కు వేత‌నాలు చెల్లించే స్ధితికి తీసుకొచ్చామ‌న్నారు. ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీల అమ‌లులో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, గృహ‌జ్యోతి, రూ. 500 సిలిండ‌ర్‌, ఆస‌రా పెన్షన్లకు సక్రమంగా నిధులు ఇస్తున్నామ‌న్నారు. అదే విధంగా గ‌త ప్రభుత్వం ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్ పెట్టిన మ‌ధ్యాహ్నఏజేన్సీ బిల్లులు, ఆశ‌, అంగ‌న్‌వాడీ, పాఠ‌శాల స్వీప‌ర్లు, గ్రామ పంచాయతీ స్వీప‌ర్ల వేత‌నాలు ప్రాధాన్యత క్రమంలో చెల్లించామ‌న్నారు. సాంఘీక సంక్షేమ‌, బీసీ వెల్ఫేర్ హాస్పటల్స్​ , గురుకుల పాఠ‌శాల‌ల్లో కొన్ని నెలలుగా గ‌త ప్రభుత్వం డైట్ బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింద‌ని, మేము అధికారంలోకి రాగానే రివ్యూ చేసి పెండింగ్ బిల్లులు చెల్లించామ‌న్నారు. విదేశాల్లో చ‌దివే విధ్యార్ధుల‌కు అందించే ఓవ‌ర్సీస్ స్కాల‌ర్ షిప్ నిధులు ఇవ్వకుండా గ‌త ప్రభుత్వం మంజూరు చేసి వెళ్లగా నిధుల‌ను మేమే విడుద‌ల చేశామ‌న్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామ‌న్నారు. 65లక్షల మంది రైతుల‌కు రూ.5575 కోట్లు రూపాయ‌లు వారి ఖాతాల్లో రైతు భ‌రోసా డ‌బ్బులు జ‌మ చేశామ‌న్నారు. మిగ‌త 5లక్షల మంది రైతుల ఖాతాల్లో డ‌బ్బులు వేస్తున్నట్లు చెప్పారు. గ‌త బీఆర్​ఎస్​ ప్రభుత్వం కంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెల‌ల్లో 93శాతం మంది రైతుల‌కు రైతు భ‌రోసా డ‌బ్బులు ఇచ్చామ‌ని వివ‌రించారు. గ‌త ప్రభుత్వంలో ఆర్టీసీ ఉంటుందా? మూసేస్తారా? అన్న అనుమానాలు ఉండేవి కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు గ్యారంటీని అమ‌లు చేసి ప్రతి మ‌హిళ ప్రయాణం చేసిన జీరో టికెట్ చార్జీల‌ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మూడు నెల‌ల్లో రూ.1125 కోట్లు ఆర్టీసీకి చెల్లించ‌డం వ‌ల్ల ఆ సంస్థ కు ప్రయోజనంగా మారిందన్నారు.

గృహ‌జ్యోతికి రూ.200 కోట్లు, రాజీవ్ ఆర్యోగ్య శ్రీ కి రూ. 189 కోట్లు, గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్స‌డికి రూ. 80 కోట్లు, ఉచిత వ్య‌వ‌సాయ క‌రెంటుకు రూ. 3924 కోట్లు, రేష‌న్ బియ్యం స‌బ్సిడి రూ.1147 కోట్లు రైతు బీమా ప్రిమీయంకు రూ.734 కోట్లు చెల్లించామ‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌హిళ‌ల‌ను ఆర్ధికంగా బ‌లోపేతం చేయడం కోసం ప్రారంభించిన వ‌డ్డిలేని రుణాల ప‌థ‌కాన్ని గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆట‌కెక్కించింద‌న్నారు. అధికారంలోకి రాగానే ఇందిర‌మ్మ రాజ్యంలో మ‌హిళ‌ల‌ను ఆర్ధికంగా స్వాలంభ‌న చేయ‌డానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ‌డ్డిలేని రుణాలు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చింద‌న్నారు. రాష్ట్ర రాజ‌ధాని న‌డిబొడ్డున ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌తో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తీసుకున్న రుణాల‌పై మ‌హిళ‌ల‌కు వ‌డ్డి చెల్లించామ‌న్నారు.

రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాల‌సీ అవ‌స‌రం
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు రంగంలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా గ‌త ప‌ది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎటువంటి కృషి చేయ‌లేద‌న్నారు. రూ.20 చోప్పున యూనిట్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజల మీద భారం మోపింద‌న్నారు. ప‌వ‌ర్ ఎక్సేంజ్‌లో పీక్ హ‌వ‌ర్స్ కోసం యూనిట్‌కు రూ.10 చొప్పున మాత్రమే త‌మ ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నదని వివ‌రించారు. త‌మ ప్రభుత్వం రానున్న రోజుల్లో ప‌ర్యావ‌ర‌ణ‌ హితమైన‌, చ‌వ‌కైన‌ రినోవేబుల్ ఎన‌ర్జీని రాష్ట్ర ప్రజలకు అందించ‌డానికి కొత్త విద్యుత్తు పాల‌సీ తీసుకురావ‌డానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే ప‌నిలో అధికారులు నిమ‌గ్నమై ఉన్నార‌ని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్తు కోత‌లు లేవ‌ని, నాణ్యమైన విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు చెప్పారు. విభ‌జ‌న చ‌ట్టంలో 4వేల మెగావాట్ల ఎన్టీపీసీ ధర్మల్​ విద్యుత్ కేటాయించిన‌ప్పటికీ 10 ఏండ్లు అధికారంలో ఉండి విస్మరించి , తెలంగాణ‌కు గుదిబండ‌గా ఉన్న యాదాద్రి, భ‌ద్రాద్రి థర్మల్​ ప‌వ‌ర్ ప్లాంటుల‌ను ప్రారంభించిన‌ బీఆర్ఎస్ ఇప్పుడు రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఎన్టీపీసీ విద్యుత్తు గురించి మాట్లాడ‌టం విడ్డురంగా ఉంద‌న్నారు. రాబోయే 25 సంవత్సరాలకు సోలార్ విద్యుత్తును యూనిట్‌కు రూ.5.59 చొప్పున అందించ‌డానికి టెండర్లు వ‌స్తున్న నేపథ్యంలో యూనిట్‌కు రూ.8 నుంచి 9 చొప్పున ఖ‌ర్చు అయ్యే ఎన్టీపీసీతో పీపీఏ చేసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై భారం మోప‌కుండా త‌క్కువ ధ‌ర‌కు గ్రీన్ ఎన‌ర్జీ అందించే సోలార్‌, పంప్డ్ స్టోరేజీ, సాలీడ్ వేస్ట్‌, విండ్ ప‌వ‌ర్ ఇచ్చే విధంగా కొత్త ప‌వ‌ర్ పాల‌సీని తీసుకురావ‌డానికి కార్యాచరణ ప్రారంభ‌మైంద‌న్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ కు నీటి కొరత రానివ్వమని అన్నారు. మిషన్​ భగరీథ పథకంతో ప్రయోజనం లేదని చెప్పారు. ఎన్నికల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గత ప్రభుత్వం నీరు వదిలారని విమర్శించారు. విద్యాహక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. కార్పొరేట్​ విద్య సంస్థల్లో ఫీజుల నియంత్రణపై దృష్టి సారించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కోడ్​ తర్వాత పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలోనే ఆర్థిక శాఖ నుండి పెండింగ్​ బిల్లులు విడుదల చేస్తున్నట్లు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here