Narendra Modi : రంగంలోకి దిగిన మోడీ. అమిత్ షా.. రేవంత్ ఉక్కిరి బిక్కిరి

0
42

Narendra Modi:

కాంగ్రెస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్

రంగంలోకి దిగిన మోదీ, అమీత్ షా

రాబోయే లోక్ సభ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ గా మారనున్నాయి. ఈ ఎన్నికలు రేవంత్ కు కత్తిమీద సాములా పరిణమించాయి. 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ముఖ్య నాయకులు బయటకు ప్రకటిస్తున్నప్పటికీ లోలోపల గుబులుగుబులుగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా తెచ్చుకున్నప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో అంత సులభంగా ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తున్నది. బీ ఆర్ ఎస్ కు కాంగ్రెస్ మధ్యన జరిగిన హోరాహోరి పోరాటంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే సీట్ల సంఖ్య పెరిగినా ఓట్ల శాతంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఈ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేశాడు. క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కింది. బీ ఆర్ ఎస్ ను ఓడించడానికి ఆయన పడని కష్టాలు, అవమానాలు లేవు. స్వంత పార్టీ నాయకుల నుండి సహకారం కరువైంది. తాను పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండే సవాళ్లు మొదలయ్యాయి. అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపారు. అధికారంలోకి తీసుకురావడంలో సఫలీక్రుతం అయ్యారు.ఐతే ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక సీఎం పదవి ఆశించిన, ఆశిస్తున్న వారు..సీఎం రేవంత్ రెడ్డికి అంతర్గతంగా సహకరించడం లేదు. ముఖ్యంగా క్యాబినెట్ రెండు మూడు వర్గాలుగా విడిపోయిందన్నదే బహిరంగ రహస్యం. దీనిని ఎలాగైనా అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నది.

ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని లోక్ సభలో ఎన్నికల్లోనూ పునరావ్రుతామవుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకు అవసరమైన ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. కానీ అప్పటి పరిస్థులు, ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు గత అసెంబ్లీ ఎన్నికలకు పోలిక కనబడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది. గత పాలకులు చేసిన అహాంకారపు పోకడల వల్ల గద్దె దిగవలిసి వచ్చింది. కేసీ ఆర్ కుటుంబానికి తగిన నేతగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. కానీ ఇప్పుడు పోరాడే శత్రువు బీ ఆర్ ఎస్ కాదు.., బీజేపీ. రాష్ట్రంలో గత పాలకులపై వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి నాయకత్వంపై నిలబడ్డారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయాలను ద్రుష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటారు. దీనిని ప్రజలు పరిగణలోకి తీసకునే అవకాశం సుస్ఫష్టం. గతంలో మాదిరిగా కాంగ్రెస్ ఎదుర్కోబోయే బీజేపీ పై బీ ఆర్ ఎస్ మీద ఉన్నంత కోపం ప్రజలకు లేదనే చెప్పాలి. అంతేకాకుండా దక్షిణ భారతదేశానికి గేట్ వేలా ఉన్నతెలంగాణలో బీజేపి పాగా వేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలో మోడీ, అమిత్ షా తెలంగాణ పై ఫోకస్ పెంచారు. ఎలాగైనా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అవసరమైన బలాలను సమకూర్చుకుంటున్నారు. బలమైన నాయకత్వాన్ని అభ్యర్థులుగా రంగంలోకి దించారు .కేంద్రంలో 10 సంవత్సరాలుగా బీజేపి అధికారంలో ఉంది. సమిష్టిగా గెలుపు క్రుషి చేసే నాయకత్వం, కార్యకర్తల బలం, హిందూ భావజాల సిద్ధాంతాలు గల ఆర్ఎస్ఎస్, ఏబీవీపి వంటి బీజేపీ అనుకూల సంస్థలు అనేకం ఉన్నాయి. పైగా తెలంగాణలో బీజేపి బలం పెరిగింది. వీటన్నింటిని రేవంత్ రెడ్డి నాయకత్వం ధీటుగా ఎదుర్కుని లోక్ సభలో ఎక్కువ పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యతారాగం వినిపిస్తున్నా..రేవంత్ రెడ్డి నాయకత్వానికి జిందాబాద్ కొడ్తున్నా.. అసంత్రుప్తి ఉన్నదన్న మాట వాస్తవం. హైకమాండ్ ఆదేశాలతో ఒకతాటిపై ఉన్నట్లు కనబడ్డప్పటికీ రేవంత్ రెడ్డికి కొంతమంది మంత్రులకు పొసగటం లేదన్నది నగ్న సత్యం. ముఖ్యంగా భట్టి విక్రమార్కకు మధ్య రేవంత్ రెడ్డి మధ్య అగాదం పెరిగిపోతున్నదన్నది ప్రచారంలో ఉంది. అంతేకాకుండా మాదిగలకు ప్రాధాన్యత కల్పించడం లేదనే అంశం మాదిగల్లో నిరాశకు గురిచేస్తున్నది. బీసీలకు కూడా పదవుల్లో అన్యాయం జరుగుతోందని చర్చ కూడా జరుగుతున్నది. ఈ విషయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అటువంటిదేమీ లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనికితోడు గేట్లు తెరిస్తే చాలా మంది వస్తారన్న రేవంత్ రెడ్డి మాటలు నిజమయ్యేటట్లు కనబడటం లేదు. బీఆర్ ఎ స్ ఎమ్మెల్యేల్లో కొందరు కాంగ్రెస్ వైపు రావాలని ఉన్నా.. వేచిచూత ధోరణి అవలంభిస్తున్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి సవాల్ గా మారాయి. దీనికితోడు పంటలు ఎండిపోవడం..కరువు పరిస్థితి రావడం కూడా ప్రతికూలంగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడం, కల్లాల్లో దాన్యం కొనుగోలు మందగించడం, మద్ధతు ధర వంటి అంశాలు కాంగ్రెస్ కు సమస్యలై కూర్చున్నాయి. దీన్ని బీజేపి, బీఆర్ ఎస్ లు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. రైతుబంధు, రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు అమలు కాని మిగతా పథకాలను తెరపైకి తెచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారు. 100 రోజులు దాటినా హామీలు అమలు చేయడం లేదనే విమర్శలకు పూనుకుంటున్నాయి. దీనిని కొంతమంది మంత్రులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా వీక్ గా ఉంది. ప్రభుత్వ పథకాల ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో లేదు. శాసనసభ ఎన్నికల సమయంలో బీ ఆర్ ఎస్ టార్గెట్ గా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టార్గెట్ కాగా..ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ టార్గెట్ గా ప్రతిపక్షాలు తమ లైన్ ను స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు కొడంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. కుట్రలు చేస్తున్నారని ప్రకటించడం కొంత వివాదస్పదమైంది.

కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డికి హై కమాండ్ దగ్గరున్న పలుకుబడి తగ్గాలనే కోరికతో ఉన్నారు. దానికోసం లోక్ సభ ఎన్నికలను ఎంచుకున్నారు. ప్రతిపక్షాలకు ఎక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి ప్రభ తొలిగిపోతుందని ఆశతో కార్యక్రమాలకు మొక్కుబడిగా సహకరిస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాకపోతే రేవంత్ రెడ్డి ని ఎన్నికల తర్వాత టార్గెట్ చేసి ముఖ్యమంత్రి మార్పు డిమాండ్లు తెరమీదకు వచ్చే అవకాశముంది. ఈ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలిచి తన సత్తా ఏమిటో చూపెట్టాలని రేవంత్ రెడ్డి ఉవ్విళ్ళూరుతున్నారు.

మల్కాజిగిరి, మహబూబ్ నగర్ ఎంపీ సీట్లను ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి ముందు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. సిట్టింగ్ స్థానంలో ఓడిపోతే విమర్శలు వస్తాయని భావించిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా తన అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ గెలువడం కూడా రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది ప్రతిమాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునితా మహేందర్ రెడ్డిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నారు. సునీతకు పోటీగా బలమైన అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మోడీ కూడా తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇక్కడి నుండే ప్రచారం చేశారు. బీజేపీ ఈ స్థానంపై గురిపెట్టింది. జడ్పీ ఛైర్ పర్సన్ గా దశాబ్ధాకాలానికి పైగా ఉన్న ఆమెకు ఈ ప్రాంతంలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించి కాంగ్రెస్ మల్కాజిగిరి అభ్యర్థిగా ఖరారు చేశారు. సునీత మహేందర్ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున అనుకూలిస్తాయని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పటికే చాలా మంది మున్సిపల్ కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర అధికారులను పార్టీలో చేర్చుకుంటున్నారు. మహేందర్ రెడ్డి కూడా తనకున్న పరిచయాలను ఉపయోగించి చాలా మందిని పార్టీలోకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను తీసుకువచ్చారు. ఐతే ఈటల ఇప్పటికే ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో వంశీచందర్ రెడ్డిని కాంగ్రెస్ అబ్యర్థిగా నిలబెట్టింది. పేరుకు వంశీచందర్ రెడ్డి అయినప్పటికీ రేవంత్ రెడ్డి పరోక్షంగా అభ్యర్థిగా ఉన్నట్లే అక్కడ ఓడిపోతే రేవంత్ మీద స్వపక్షం, ప్రతిపక్షం విమర్శలు చేయకమానదు. ఇక్కడ రాజకీయాల్లో సీనియర్ అయిన డీకే . అరుణ ను బీజేపీ పోటీలో దించింది. ఈమెకు అనుకూలంగా మోడీ, అమిత్ షా నేరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీకి టఫ్ ఫైట్ ఉండే అవకాశముంది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి అంతర్గతంగా మద్ధతు తెలిపే అవకాశాలు కనబడుతున్నాయి.

వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను గ్రూపుగా చేసి అక్కడి అభ్యర్థి గెలుపు బాధ్యతలను రేవంత్ రెడ్డి వారి నెత్తిన పెడ్తున్నారు. ఈ క్రమంలో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గా పనిచేస్తుండటంతో బీజేపి తన పని తాను చేసుకుంటూ పోతూ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్ ను దెబ్బకొట్టి అత్యధిక సీట్లు కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తుంది. ఐతే మెజారిటీ సీట్లు రావాలని రేవంత్ రెడ్డి పథకం రచిస్తున్నారు. మెజారిటీ సీట్లు వస్తే క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డికి …తక్కువ సీట్లు వస్తే కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఎన్నికల్లో అనుకూలంగా మారితే సరే..లేదంటే రేవంత్ రెడ్డి మీద స్వంత పార్టీ వారే దుమ్మెత్తి పోయకమానరు. తెలంగాణలో మిగతా పార్టీ అధ్యక్షులకు లేనంత ప్రమాదం రేవంత్ రెడ్డి కి మాత్రమే ఉంది. అటు స్వపక్షం, ఇటు విపక్షం నోరు మూపియ్యాలంటే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కు రావాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనికితోడు స్టార్ క్యాంపేయనర్ గా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కూడా ఎంపిక చేసింది. పక్క రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ స్వంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవడమంటే రేవంత్ రెడ్డికి మామూలు విషయం కాదు. దీన్నే బీజేపీ అడ్వంటేజ్ గా తీసుకుంటున్నది. 25 న అమిత్ షా, 27న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వార్ పీక్ దశకు చేరుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here