SINGARENI: 40 ఏండ్లు నిండినా సింగరేణిలో కారుణ్య నియామకం- ఉత్తర్వులు జారీచేసిన ఎండీ బలరాం

0
9

SINGARENI:

సింగరేణిలో కారుణ్య ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 35 సంవత్సరాలు దాటి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్న వారికి యాజమాన్యం తీపి కబురు అందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి కార్మికులకు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్.బలరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

300 మందికి ప్రయోజనం

దాదాపు దశాబ్ద కాలంగా వయో పరిమితి నిబంధన వల్ల వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను అందుకోలేకపోయారని, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బదిలీ వర్కర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఈ విషయంపై కూలంకశంగా చర్చించి సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఒప్పించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2018 మార్చి 9వ తేదీ నుండి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీంను వర్తింపజేస్తున్నామని తెలియజేశారు. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న దాదాపు 300 మందికి తక్షణమే ప్రయోజనం చేకూరనుందన్నారు. అలాగే రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గరిష్ట వయో పరిమితి దాటిన వాళ్లు సింగరేణిలో ఉద్యోగం పొందడం కోసం దొంగ ధ్రువీకరణ పత్రాలతో తప్పుడు మార్గాలను ఆశ్రయించడం జరుగుతోందని.. దీని వల్ల విజిలెన్స్ కేసులను ఎదుర్కోవడంతోపాటు వారికి వచ్చే అన్ని బెనిఫిట్స్ను కోల్పోతున్నారని. వయో పరిమితి పెంపు వల్ల తప్పుడు మార్గాలను ఆశ్రయించబోరని పేర్కొన్నారు.

వివరాలు ఇవే

సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఎవరైనా కార్మికుడు లేదా ఉద్యోగి మృతి చెందినట్లయితే ఆయన స్థానంలో అతని వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తుంటారు. అలాగే అనారోగ్య కారణాల రీత్యా ఉద్యోగానికి అనర్హులుగా మెడికల్ బోర్డు ప్రకటించిన కార్మికుల వారసులకు కూడా సింగరేణి సంస్థ బదిలీ వర్కర్ గా ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది .అయితే ఈ రెండు విభాగాల్లోనూ వారసుల కనిష్ట వయసు 18 సంవత్సరాలుగాను గరిష్ట వయసు 35 సంవత్సరాలుగా పేర్కొనడం జరిగింది. కరోనా సమయంలో దాదాపు రెండేళ్లపాటు మెడికల్ బోర్డు నిర్వహించని కారణంగా కొంతమంది వారసులు గరిష్ట వయోపరిమితిని దాటిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు డిపెడెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుండి 40 ఏళ్లకు పెంచాలని ఎంతోకాలంగా యాజమాన్యానికి మొరపెట్టుకున్నారు. కొంతమంది కార్మికులు మెడికల్ బోర్డులో అన్ ఫిట్ అయినప్పటికీ. వారి వారసుల వయసు 35 సంవత్సరాలు దాటడంతో ఉద్యోగం పొందే అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితి కొన్ని కుటుంబాలలో చోటు చేసుకోవడంతో, ఆ కుటుంబాల వారసులకు ఉద్యోగం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఇటీవల హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యంలో 441 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సభా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లకు పెంచాలని, కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తప్పనిసరిగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సింగరేణి యాజమాన్యంతో జరిగిన సమీక్ష సమావేశాల్లో ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ ను ఆదేశించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here