డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బెంగళూరులో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను గురువారం మీడియాకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాల్ వెల్లడించారు,. మెహిదీపట్నంకు చెందిన మాన్ సింగ్ బాట్లా అలియాస్ తేజ డిగ్రీ వరకు చదివి, చెఫ్‌గా పనిచేశాడు. తరుచు తన కాలేజీ స్కూల్ ఫ్రెండ్స్‌ను కలుస్తుండేవాడు. ఆ సమయంలో తన సీనియర్స్ గంజాయి తీసుకుంటూ కన్పించేవారు. అప్పటికే రెండు కేసులలో జైలుకు వెళ్లి వచ్చిన మాన్సింగ్, ఆ తరువాత హెల్త్ కేర్ కన్సల్టెంట్‌గా చేరాడు. ఆ తరువాత టోలిచౌక్‌కు చెందిన సయ్యద్ ఓబైద్, షబ్బీర్ హుస్సేన్‌లను కలుసుకొని తన ఫ్లాన్‌ను వివరించాడు. దీంతో ఇద్దరు డ్రగ్స్ హైదరాబాద్‌లో విక్రయించేందుకు అంగీకరించారు. ఇందులోభాగంగానే బెంగళూర్‌లోని యశ్వంత్‌పూర్‌లో ఉన్న ఒక నైజీరియన్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి 7 గ్రాముల హెరాయిన్‌తో మాన్సింగ్ హైదరాబాద్‌కు వచ్చాడు. బెంగళూర్ నుంచి రాగానే మిగతా ఇద్దరు సయ్యద్ ఒబైద్, షబ్బార్ హుస్సేన్‌లను రేతిబౌలిలో కలిశాడు. సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి ముగ్గురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 7 గ్రాముల హెరాయిన్, ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.