CM:ఉద్యోగాలపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

0
7

అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM:హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేసి అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఘట్‌కేసర్‌లో తెలంగాణ ఉద్యమ గేయ రచయిత అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో యువతను తీవ్రంగా మోసం చేసిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలు

గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్న వారే ఇప్పుడు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. నోటిఫికేషన్లు జారీ చేసి కూడా ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడారని అన్నారు.

ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియామక ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి కేవలం ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఎల్‌బీ స్టేడియంలో తల్లిదండ్రుల సమక్షంలో నియామక పత్రాలు అందజేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఆ కుటుంబాల ఆనందమే తమ ప్రభుత్వానికి అతిపెద్ద సంతృప్తి అని చెప్పారు.

బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదన్న సీఎం

పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ కుటుంబం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పూర్తిగా విస్మరించిందని సీఎం ఆరోపించారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు, ప్రొఫెసర్ కోదండరామ్‌లకు ప్రజా ప్రభుత్వం తగిన గౌరవం కల్పించిందన్నారు. తెలంగాణకు సేవలందించిన తొమ్మిది మంది కవులను ఒక్కొక్కరికి రూ.1 కోటి నగదు పురస్కారంతో సత్కరించినట్లు గుర్తు చేశారు.

తెలంగాణను మళ్లీ దోచుకునే అవకాశం ఇవ్వం

తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కంటోందని సీఎం విమర్శించారు. పవిత్ర తులసి వనంలాంటి తెలంగాణలో ఆ కలుపు మొక్క మళ్లీ మొలకెత్తనివ్వబోమని స్పష్టం చేశారు.

అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ మా స్ఫూర్తి

తమకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్ఫూర్తి అని, బీఆర్ఎస్‌కు నిజాం, ఖాసిం రజ్వీ ఆదర్శాలని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం అన్నింటినీ గమనిస్తోందని, ప్రజలు మరోసారి దోపిడీ పాలనకు అవకాశం ఇవ్వబోరని అన్నారు.

అందెశ్రీ సేవలను స్మరించిన సీఎం

తెలంగాణ ఆత్మగీతంగా నిలిచిన “జయ జయహే తెలంగాణ” పాటను రచించిన అందెశ్రీ సేవలను సీఎం కొనియాడారు. ఆయన పాటలు ఉద్యమానికి చైతన్యం నింపాయని, ఫ్యూడల్ శక్తులపై పోరాటానికి ప్రజలను ప్రేరేపించాయని చెప్పారు. అందెశ్రీని తన కుటుంబ సభ్యుడిలా భావిస్తానని పేర్కొన్న సీఎం, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here