YUVA SANGRAMA SADASSU: తెలంగాణ యువతను “యూత్ డిక్లరేషన్” పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, అదే యువత ఇప్పుడు కాంగ్రెస్‌కు రాజకీయంగా “డెత్ డిక్లరేషన్” రాయబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) అన్నారు.హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడేళ్ల క్రితం ఇదే వేదికపై కాంగ్రెస్ ప్రకటించిన “యూత్ డిక్లరేషన్”లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
‘యూత్ డిక్లరేషన్’ అమలు కాలేదన్న కేటీఆర్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 24 హామీల్లో ముఖ్యమైన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఉద్యోగాల భర్తీకి బదులుగా రాష్ట్రంలో “నోటిఫికేషన్లు కాదు… లూటిఫికేషన్లు” జరుగుతున్నాయని ఆరోపించారు.
70 వేల ఉద్యోగాలపై బహిరంగ సవాల్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోందని, అవి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారానే భర్తీ అయ్యాయని రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన నియామక ప్రక్రియలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని ఆయన ఆరోపించారు.తెలంగాణ నిరుద్యోగ యువతకు తాను ఒక అన్నగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.విద్యార్థులను కేసుల్లో ఇరికించే రాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు
రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గడానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని, మరోవైపు తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, యువత భవిష్యత్తుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు.
అధికారంలోకి వస్తే యువతకు ప్రాధాన్యం
తదుపరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక విధానాలు అమలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 2028లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, యువతకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సభలో పాల్గొన్న నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ పేర్కొంది.



