CM Revanth reddy :టచ్ చూడు బిడ్డా :కెసిఆర్ కు రేవంత్ రెడ్డి హెచ్చరిక

0
40

CM Revanth reddy :


-కేసీఆర్​కు సీఎం రేవంత్​ హెచ్చరిక
-కేసీఆర్​కు కాలం చెల్లింది… కారు షెడ్డుకు పోయింది
-దేశ వ్యాప్తంగా రాహుల్​ గాంధీ గాలి
-జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం

-రుణమాఫీ, సంక్షేమపథకాలు అమలు
-ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు.. మోదీని ఓడించేందుకు -అన్ని శక్తులను కూడగట్టుకుని ముందుకు
-పాలమూరు, మహబూబాబాద్ ఎన్నికల ప్రచారం​లో సీఎం రేవంత్​

కాంగ్రెస్​పార్టీని, పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్​ సర్కారును ముట్టుకుంటే మాడి మసైపోతావని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​రెడ్డి గులాబిదళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావును హెచ్చరించారు. గురువారం నాడు పార్టీ నేతల సమావేశంలో 20మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తనతో టచ్​లో ఉన్నారంటూ కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్​రెడ్డి గట్టి వార్నింగ్​ ఇచ్చారు. శుక్రవారం మహబూబ్​నగర్​ లోక్​సభ అభ్యర్థిగా వంశీచంద్​రెడ్డి నామినేషన్​దాఖలు కార్యక్రమంలో సీఎం హాజరయ్యారు. అనంతరం మహబూబాబాద్​లో జరిగిన జనజాతరలో సీఎం రేవంత్​రెడ్డి ప్రసంగిస్తూ బీఆర్​ఎస్​, బీజేపీ తీరుపై సివమెత్తారు. మహబూబ్​నగర్​లో భారీ ర్యాలీగా వెళ్లి వంశీచంద్​రెడ్డితో కలిసి నామినేషన్​పత్రాలు దాఖలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణుల సమావేశంలో రేవంత్​రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్​కు కాలం చెల్లిందని..కారు షెడ్డుకు పోయిందని, ఇక షెడ్​నుంచి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని రేవంత ఆరోపించారు. ‘‘మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి. ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో లెక్క పెట్టుకో’’ అని కేసీఆర్‌కి రేవంత్ సవాల్ విసిరారు.


పాలమూరు ఎంపీగా ఏం చేశావ్​..
2009 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గెలిపించారని.. గెలిపిస్తే ఆయన(కేసీఆర్​) ఏం చేశారని రేవంత్​ ప్రశ్నించారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో కేసీఆర్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని నిలదీశారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సహకరించలేదన్నారు. పరిశ్రమలను జిల్లాకు తీసుకురాలేదని.. కానీ మళ్లీ కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పార్లమెంట్‌లో పాలమూరు గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును బొంద తీసి పాతి పెట్టారని ఎద్దేవా చేశారు. కారును తూకం పెట్టి అమ్ముడేనని సెటైర్లు గుప్పించారు. రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ లాంటి వాడని.. ముట్టుకుంటే మాడిపోతారని హెచ్చరించారు.ఇది ఆడబిడ్డల ప్రభుత్వమని.. స్వయం సహాయక బృందాలతో మహిళా సంఘాలను ఆదుకున్నామని తెలిపారు.
గజ్వేల్​ దొరలు, గద్వాల గడీల దొరసానిని పాతరేయాలి…


గజ్వేల్ దొరలు – గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారని, ఈ ఎన్నికల్లో ఇద్దరిని పాతర వేయాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. గద్వాల గడీల దొరసాని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​తో కుమ్మక్కై తన అల్లుడి గెలుపుకోసం బీసీ మహిళను ఓడించారని, జిల్లాలోని కురుమ సోదరులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటేసి అరుణపై కక్షతీర్చుకోవాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు నిధులను తీసుకువచ్చి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరుకి సువర్ణ అవకాశమొచ్చిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత తమదని తెలిపారు. పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించాలని.. జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు.
డీకే అరుణ జిల్లాకు ఏం చేశారు..?
బీజేపీ నేత డీకే అరుణ జిల్లా అభివృద్ధికి కృషి చేయలేదని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. 100 రోజులు కాకమునుపే ప్రభుత్వాన్ని కూలదోయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. నాడు పలుగు, పారాబట్టి పాలమూరు నుంచి వలసలు పోయేవారని చెప్పారు. నేడు అదే పాలమూరు బిడ్డ నాయకుడై దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ఠ పెంచారని అన్నారు. వంశీ చంద్ రెడ్డిని, మల్లు రవిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
మోదీ, ఫాంహౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారు.. సీఎం రేవంత్ విసుర్లు
మహబూబాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ కేసీఆర్​ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్​రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.దిగిపో దిగిపో అంటున్నావ్… ఉత్తగ వచ్చామా బిడ్డా అని కేసీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఆగష్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారని అన్నారు. తండ్రి రెడ్యానాయక్‌ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే… మోదీ లాథూర్‌కు తరలించుకుపోయారని విరుచుకుపడ్డారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధీనే మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకి లేదని చెప్పారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ తెలంగాణను అవమాన పరిచారని ధ్వజమెత్తారు. అప్పుడు పార్లమెంట్‌లోతానే ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేశారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళాకు మోదీ వేల కోట్లు ఖర్చు చేశారని.. మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్‌ను కేసీఆర్ మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పథవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో రైతులను మోదీ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు. 100రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర భారతంలో కుంభమేళాకు, గంగానది ప్రక్షాళనకు కేంద్రం వేలాది కోట్లు ఇచ్చింది… కానీ మేడారం జాతరకు ముష్టి మూడు కోట్లు ఇస్తారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు.


మోడీ, కేడీలది చీకటి ఒప్పందం..
బిడ్డ బెయిల్ కోసం బీఆరెస్ ను కేసీఆర్ మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ రేవంత్​ ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహులకు ఒక్క ఓటు వేయొద్దు.. ఒక్క సీటు ఇవ్వొద్దు అంటూ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ బిడ్డను ప్రధాని చేసే బాధ్యత మనపై ఉందన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ తేదీని ప్రకటించారు. తెలంగాణ నుంచి..14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాంమన్నారు. రైతులకు రెండింతలు ఆదాయం తెస్తానన్న మోదీ రైతులను కాల్చి చంపారంటూ మండిపడ్డారు., ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తానన్న మోదీ తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఆగస్టు 15లోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని, భద్రాద్రి రాముడి సాక్షిగా నేను మాట ఇస్తున్నానని సీఎం తెలిపారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది.. వచ్చే పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి తీరుతాం.. బలరాం నాయక్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్​రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here