Uttam kumar reddy :
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, జై వీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి కమ్యూనిస్ట్ నాయకులు, తెలుగుదేశం జెండాతో ఓ కార్యకర్త రావడం గమనార్హం.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… 30 ఏళ్ల పాటు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నిస్వార్థంగా సేవ చేశానని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో రఘు వీర్ రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా కోదాడ సమావేశానికి వచ్చిన కమ్యూనిస్ట్ ల సేవలు మర్చిపోమని కొనియాడారు. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై కాంగ్రెస్‌కు సహకరించి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీని ఓడించాలని కోరారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని మండిపడ్డారు. 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చినా పెంచక పోగా ఇంకా ఆదాయం తగ్గించారని మండిపడ్డారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీథో పొంచి ఉన్న ప్రమాదం …
బీజేపీతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మాటిచ్చారు. మద్దతు ధర తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోనే కోదాడ నియోజకవర్గాన్ని మోడల్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు